Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, September 28, 2013

2వ దినవృత్తాంతములు 1

2Ch 1:1  దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడ ఉండి అతనిని బహు ఘనుడైన రాజునుగా చేసెను. 
2Ch 1:2  యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక 
2Ch 1:3  సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల యిండ్లకు పెద్దలైనవారి కందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును 
2Ch 1:4  సొలొమోనుతో కూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను. 
2Ch 1:5  హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి. 
2Ch 1:6  సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను. 
2Ch 1:7  ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమైనేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా 
2Ch 1:8  సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెనునీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక 
2Ch 1:9  దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు 
2Ch 1:10  ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. 
2Ch 1:11  అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెనునీవు ఈ ప్రకారము యోచించు కొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు. 
2Ch 1:12  కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్య బడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. 
2Ch 1:13  పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీ యులను ఏలుచుండెను. 
2Ch 1:14  సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమ కూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండు వేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. 
2Ch 1:15  రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను. 
2Ch 1:16  సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర నిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. 
2Ch 1:17  వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి. 

2వ దినవృత్తాంతములు 2

2Ch 2:1  సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని 
2Ch 2:2  బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబది వేలమందిని ఏర్పరచుకొని వీరిమీద మూడు వేల ఆరువందల మందిని అధిపతులుగా ఉంచెను. 
2Ch 2:3  సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. 
2Ch 2:4  నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినములయందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను. 
2Ch 2:5  నేనుకట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక 
2Ch 2:6  ఆకాశ ములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయ నకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను. 
2Ch 2:7  నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడైయుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలు తోను చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము. 
2Ch 2:8  మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది. 
2Ch 2:9  కాగా లెబానోనునుండి సరళమ్రానులను దేవదారుమ్రానులను చందనపుమ్రానులను నాకు పంపుము; నేను కట్టించ బోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడ పోవుదురు. 
2Ch 2:10  మ్రానులుకొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను. 
2Ch 2:11  అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసిపంపిన ఉత్తరమేమనగాయెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారిమీద రాజుగా నియమించి యున్నాడు. 
2Ch 2:12  యెహోవాఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధి మంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. 
2Ch 2:13  తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను. 
2Ch 2:14  అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలినూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలిన వాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. 
2Ch 2:15  ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల 
2Ch 2:16  మేము నీకు కావలసినమ్రానులన్నియు లెబానోనునందు కొట్టించి వాటిని నీకొరకు సముద్రముమీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము, తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొన వచ్చును అని వ్రాసెను. 
2Ch 2:17  సొలొమోను తన తండ్రి యైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్ష యెనుబదిమూడువేల ఆరువందలమందియైరి. 
2Ch 2:18  వీరిలో బరువులు మోయుటకు డెబ్బది వేల మందిని పర్వతములందు మ్రానులు కొట్టుటకు ఎనుబది వేల మందిని, జనులమీద అధిపతులుగానుండి పనిచేయించుటకు మూడువేల ఆరు వందల మందిని అతడు ఏర్పరచెను. 

2వ దినవృత్తాంతములు 3

2Ch 3:1  తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి యైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారం భించెను. 
2Ch 3:2  తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవ నెల రెండవ దినమందు దాని కట్టనారంభించెను. 
2Ch 3:3  దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు. 
2Ch 3:4  మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రసశ్తమైన బంగారముతో అతడు పొదిగించెను. 
2Ch 3:5  మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి 
2Ch 3:6  ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీమునుండి వచ్చినది. 
2Ch 3:7  మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను. 
2Ch 3:8  మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను. 
2Ch 3:9  మేకుల యెత్తు ఏబది తులముల బంగారు; మీదిగదులను బంగారముతో పొదిగించెను. 
2Ch 3:10  అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. 
2Ch 3:11  ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు, 
2Ch 3:12  ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను, రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. 
2Ch 3:13  ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు ఇరువది మూరలు వ్యాపించెను, కెరూబులు పాదములమీద నిలువబడెను, వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి యుండెను. 
2Ch 3:14  అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను. 
2Ch 3:15  ఇదియు గాక మందిరము ముందర ఉండుటకై ముప్పదియయిదు మూరల యెత్తుగల రెండు స్తంభములను వాటిమీదికి అయిదు మూరల యెత్తుగల పీటలను చేయించెను. 
2Ch 3:16  గర్భాలయము నందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను. 
2Ch 3:17  ఆ రెండు స్థంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమతట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేళ్లు పెట్టెను. 

2వ దినవృత్తాంతములు 4

2Ch 4:1  అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠ మును చేయించెను. 
2Ch 4:2  పోతపోసిన సముద్రపు తొట్టియొకటి చేయించెను, అది యీ యంచుకు ఆ యంచుకు పది మూరల యెడము గలది; దానియెత్తు అయిదు మూరలు, దాని కైవారము ముప్పదిమూరలు, 
2Ch 4:3  దాని క్రిందితట్టున ఎద్దులు రూపింపబడియుండెను, అవి ఒక్కొక్క మూరకు పదేసియుండెను, అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను; ఎద్దులు రెండు వరుసలు తీరి యుండెను, అవి తొట్టితోకూడనే పోతపోయబడెను. 
2Ch 4:4  అది పండ్రెండు ఎద్దులమీద నిలువబడెను, మూడు ఎద్దులు ఉత్తరపుతట్టు మూడు పడమటితట్టు మూడు దక్షిణపుతట్టు మూడు తూర్పుతట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచ బడెను, వాటి వెనుకటి పార్శ్వములన్నియు లోపలికి తిరిగి యుండెను. 
2Ch 4:5  అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామర పుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును. 
2Ch 4:6  మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడి తట్టుకు అయిదును ఎడమ తట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. 
2Ch 4:7  మరియు వాటిని గూర్చిన విధి ననుసరించి పది బంగారపు దీపస్తంభములను చేయించి, దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను. 
2Ch 4:8  పది బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను; నూరు బంగారపు తొట్లను చేయించెను. 
2Ch 4:9  అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. 
2Ch 4:10  సముద్రపు తొట్టిని తూర్పుతట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. 
2Ch 4:11  హూరాము పాత్రలను బూడిదె నెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను; రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము దేవుని మందిరమునకు చేయ వలసిన పనియంతయు హూరాము సమాప్తిచేసెను. 
2Ch 4:12  దాని వివరమేమనగా, రెండు స్తంభములు, వాటి పళ్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్లెములు, ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పుట కైన రెండు అల్లికలు, 
2Ch 4:13  ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు. 
2Ch 4:14  మట్లు, మట్లమీదనుండు తొట్లు, 
2Ch 4:15  సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు, 
2Ch 4:16  పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను. 
2Ch 4:17  యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను. 
2Ch 4:18  ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను. 
2Ch 4:19  దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, 
2Ch 4:20  వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, 
2Ch 4:21  పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. 
2Ch 4:22  మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగారముతో చేయబడెను. 

2వ దినవృత్తాంతములు 5

2Ch 5:1  సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రి యైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. 
2Ch 5:2  తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారు లగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమ కూర్చెను. 
2Ch 5:3  ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి. 
2Ch 5:4  ఇశ్రాయేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి 
2Ch 5:5  రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱలను పశువులను బలిగా అర్పించిరి. 
2Ch 5:6  లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడా రమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణము లన్నిటిని తీసికొని వచ్చిరి. 
2Ch 5:7  మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి. 
2Ch 5:8  మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందస మును దాని దండెలను కమ్మెను. 
2Ch 5:9  వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి. 
2Ch 5:10  ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు. 
2Ch 5:11  యాజకులు పరిశుద్ధస్థలమునుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకు లందరును తమ వంతులు చూడకుండ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. 
2Ch 5:12  ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధ మైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి, 
2Ch 5:13  వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తియెహోవా దయా ళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి. 
2Ch 5:14  అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువ లేకపోయిరి. 

2వ దినవృత్తాంతములు 6

2Ch 6:1  అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 
2Ch 6:2  నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మంది రమును నీకు కట్టించియున్నాను అని చెప్పి 
2Ch 6:3  రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను. 
2Ch 6:4  మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెనునా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. 
2Ch 6:5  ఆయన సెలవిచ్చినదేమనగానేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలు కొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై యేమనుష్యునియైనను నేను నియమింపలేదు. 
2Ch 6:6  ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. 
2Ch 6:7  ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి యైన దావీదు మనోభిలాష గలవాడాయెను. 
2Ch 6:8  అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని 
2Ch 6:9  నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. 
2Ch 6:10  అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి 
2Ch 6:11  యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి 
2Ch 6:12  ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. 
2Ch 6:13  తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయు లందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను. 
2Ch 6:14  యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. 
2Ch 6:15  నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు. 
2Ch 6:16  నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీ యుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము. 
2Ch 6:17  ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక. 
2Ch 6:18  మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశ మును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా? 
2Ch 6:19  దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. 
2Ch 6:20  నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక. 
2Ch 6:21  నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము. 
2Ch 6:22  ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు 
2Ch 6:23  నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. 
2Ch 6:24  నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టియెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పు కొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల 
2Ch 6:25  ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక. 
2Ch 6:26  వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచి పెట్టి తిరిగినయెడల 
2Ch 6:27  ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయ చేయుదువుగాక. 
2Ch 6:28  దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను 
2Ch 6:29  ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి 
2Ch 6:30  నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులు కలిగి 
2Ch 6:31  నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయ చేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా. 
2Ch 6:32  మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపముచేసినపుడు 
2Ch 6:33  నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందుభయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక. 
2Ch 6:34  నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరుకొనిన యీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసిన యెడల 
2Ch 6:35  ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. 
2Ch 6:36  పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా 
2Ch 6:37  వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పు కొనిమేము పాపముచేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడచితిమి అని ఒప్పుకొని 
2Ch 6:38  తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల 
2Ch 6:39  నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక. 
2Ch 6:40  నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. 
2Ch 6:41  నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక. 
2Ch 6:42  దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తు డైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము. 

2వ దినవృత్తాంతములు 7

2Ch 7:1  సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతర మైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మంది రమునిండ నిండెను, 
2Ch 7:2  యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. 
2Ch 7:3  అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసియెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. 
2Ch 7:4  రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి. 
2Ch 7:5  రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱలను బలులుగా అర్పించెను; యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదు రుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయు లందరును నిలిచియుండగను 
2Ch 7:6  రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి. 
2Ch 7:7  మరియు తాను చేయించిన యిత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను. 
2Ch 7:8  ఆ సమయ మందు సొలొమోనును, అతనితో కూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి 
2Ch 7:9  యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి. 
2Ch 7:10  ఏడవ నెల యిరువది మూడవ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్లునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. 
2Ch 7:11  ఆ ప్రకారము సొలొ మోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండ నెరవేర్చి పని ముగించెను. 
2Ch 7:12  అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. 
2Ch 7:13  వాన కురియకుండ నేను ఆకాశ మును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయు టకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని, 
2Ch 7:14  నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. 
2Ch 7:15  ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, 
2Ch 7:16  నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దానిమీద నుండును. 
2Ch 7:17  నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించినయెడల 
2Ch 7:18  ఇశ్రాయేలీయులను ఏలు టకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును. 
2Ch 7:19  అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసిన యెడల 
2Ch 7:20  నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. 
2Ch 7:21  అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొందియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా 
2Ch 7:22  జనులుఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.